24 May 2016

చాయిస్ నీదే

చాయిస్
అయ్యో, నాజీవితం నాశనమైపోయిందే అనుకుంటే,
అక్కడే ఆగిపోతావ్, దిగాలుపడి...పోతావ్
ఎలాగైనా బాగుపడాలనుకుంటే, 
మళ్ళీ మొదలెడతావ్, ఎదిగి...పోతావ్
పోవడం కామనైనప్పుడు
ఎదిగి పోవాలో, చితికి పోవాలో
చాయిస్ నీదే,
తియ్యరా...బండి...! చెయ్యరా...యుద్ధం...!!
ఓడితే బతుకుతావ్, గెలిస్తే జీవిస్తావ్...
ఆడకుంటే మాత్రం, పోరాడకుంటే మాత్రం
బతుకుతూ చస్తుంటావ్, చస్తూ బతుకుతుంటావ్
అలా బతకడంకంటే, చావడం నయం...
తియ్యరా...బండి
చెయ్యరా...యుద్ధం...!!

23 May 2016

Kavitham ...

జాబిల్లి జలధారని ....... కలంలోకి కురిపించి,
చిగురించే సిరా చుక్కని ...... సరికొత్తగ నడిపించి,
కల కాంచిన మధుజల్లులొ ... ఎద వేసే పరవళ్ళను,
తేనేలాంటి తెలుగులో... తియ్యగా పలికిస్తే
తొలి తొలకరి చినుకులో తడవచ్చు ,,
హరివిల్లులు ఎన్నెన్నో ఒక్కసారి చూడచ్చు ,,
కోయిలతో గొంతు కలిపి పాడచ్చు,,,
మబ్బులతో ముచ్చటగా అంత్యాక్షరి ఆడచ్చు ,,
నింగిలో ఈలలేసి ఊయలలో ఊగచ్చు,,,

ఎవరు నీవు ?

నీ దగ్గిర అన్నీ వున్నప్పుడు,
నిన్ను అందమైన శిల్పం అన్నారు - పొంగిపోయావు!
ఏమీ లేనప్పుడు,
నిన్ను పనికిరాని శిథిలం అన్నారు - కృంగిపోయావు!
నిజానికి నువ్వు శిల్పం కాదు, శిథిలమూ కాదు...
ఏ కోణం కొలవలేని వృత్తానివి, ఏ అభిప్రాయానికి చిక్కని అనంతానివి!
చెక్కితే రాయి శిల్పం అవుతుంది, కూల్చితే కొండ శిథిలం అవుతుంది.
కానీ, నీ భయాన్ని ఎదిరించిన నీ ధైర్యమే, అనంతం అవుతుంది!
మిణుకు మిణుకుమంటూ రోజూ బ్రతుకునీడ్చే బల్బు కంటే,
ఒక్కసారి జివ్వున వెలిగి ఆరిపోయే నిప్పురవ్వే గొప్పది!
అభిప్రాయాల సంకెళ్ళని తెంచుకుని,
మనస్సాక్షి అనే మాలని ధరించు!
సుఖం సంగతి నాకు తెలీదు కానీ,
సంతోషం మాత్రం నిన్ను వెంటాడుతూ వస్తుంది - కౌగిలించుకోమని! 

22 May 2016

స్వార్ధం ఎందుకు ?

కురిసే వానకు స్వార్ధం లేదు...
పండే పంటకు స్వార్ధం లేదు...
నింగికీ నేలకీ లేని స్వార్ధం,
మధ్యన ఉన్న మనిషికెందుకు?
పుట్టినప్పుడు పట్టుకురాడు...
పోయేటప్పుడు పట్టుకుపోడు...
మూడునాళ్ళ ముచ్చట కోసం,
ఈ మోసాలెందుకు ద్వేషాలెందుకు?

21 May 2016

కొంచెం నవ్వు, కొంచెం ధైర్యం అవి చాలా అవసరం.

ఈ రోజు ఏం చేసావని అడిగితే,
'ఒకడిని నవ్వించా, ఒకడికి ధైర్యం ఇచ్చా'
అని చెప్పేలా గడిపితే చాలు.
ప్రతీసారీ దండయాత్రలు చేసి 
రాజ్యాలే గెలవాల్సిన అవసరం లేదు,
ఒక్కోసారి భయంతో వణుకుతున్న
పక్కవాడి చెయ్యిని గట్టిగా పట్టుకుంటే చాలు...
మనుషులమే కదా?
అణుబాంబులు సృష్టిస్తాం, శిఖరాలు ఎక్కేస్తాం,
చెరువులు తవ్వేస్తాం, ఎదైనా చేసేయగలం కదా...
ఈ మాత్రం చేయలేమా?
కొంచెం నవ్వు, కొంచెం ధైర్యం.
ఎవరికో అవి చాలా అవసరం.
కొంచెం ఓపిక తెచ్చుకొని ఇచ్చేసెయ్‌!

20 May 2016

సిన్సియర్ గా ప్రేమిస్తే ...

దేవుడిని సిన్సియర్ గా ప్రేమిస్తే "రామదాసు" అవుతారు, 
అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమిస్తే "దేవదాసు" అవుతారు, 
కవిత్వాన్ని సిన్సియర్ గా ప్రేమిస్తే "కబీర్ దాసు" అవుతారు, 
పాటని సిన్సియర్ గా ప్రేమిస్తే "ఏసుదాసు" అవుతారు...! 

19 May 2016

కంఠం మీద కత్తి

కంఠం మీద కత్తి,
ఎలుగెత్తి పాడలేను…
ముంజేతికి బ్యాండేజీ,
చెలరేగి వ్రాయలేను…
సిరాబుడ్డిలో సాలీడు,
సిగిరెట్టు నుసి రాలలేదు…
అరెరే... చిక్కులు పడిందయ్యా
ఆలోచనల దారం...!
— పంతుల జోగారావు

18 May 2016

స్త్రీ ఒక మాట

స్త్రీ ఒక మాట వల్లనో,
ఒక చూపు వల్లనో
పురుషునికి సందిచ్చిందా…
ఇక అతని అధికారానికీ,
కోరికలకీ, విన్నపాలకీ అంతమే ఉండదు!
అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ –
మొదటినించి విముఖంగానే ఉండాలి,
నిప్పు వలే ఉండాలి…!
— గుడిపాటి వెంకట “చలం”