28 February 2015

ఎంత కష్టం

దారి దాపున చెత్తకుప్పల చిత్తు చిరుగుల నేరుకుంటూ
చిట్టికొడుకును చంక మోసి అలిసిపోయే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
చిరిగిపోయి మాసిపోయిన చీరకొంగును బొడ్డు దోపి 
పాలుగారే చిట్టి బిడ్డను బొంత మీద పండబెట్టి
మట్టిరాళ్ళను మోసుకెళ్ళే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
నెత్తి మీదన మోపు బెట్టి కాలినడకన ఊర్లు తిరిగి,
చంక జొలెన బిడ్డ నొదలక
కడుపు కూటికి చీపుర్లనమ్మే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
పందులున్నా కుక్కలున్నా దోమలున్నా ఈగలున్నా
పలుగు పరకతో రొచ్చు తీసి,
పాయి ఖానాలను శుభ్రం చేసే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
మంచుకురుసినా మండుటెండలయినా,
అర్థరాత్రయినా అపరాహ్ణమయినా పిల్లపాపలను పెనిమిటిని వదలి
చీపురెట్టి నగరరోడ్లను శుభ్రం చేసే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
భూమి తల్లిని నమ్ముకోని ఎండ గాని వాన గానీ
దుక్కి దున్ని నాట్లు వేసి కలుపు తీసి
కండె జూసి పంట కోసి ఎండబెట్టి ఎండిబొయ్యే రైతుతల్లికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
పచ్చ రవిక తొడిగి తెల్ల చీర కట్టి,
మల్లెపూలు ముడిచి ముస్తాబుగ అలంకరించి
పస వాడని పసిడితల్లిని మాతమ్మను చేసి,
ఆచారం పేరిట మాతమ్మయిన ఆ చిన్నతల్లికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
ఆడపిల్ల కెవ్వుమంటే వడ్ల గింజను నోటదోసి
పురిటి పసికందు ప్రాణాలు తీసే తల్లితండ్రుల దాష్టికానికి
బలి అయిన అన్నెం పున్నెం ఎరుగని ఆడపిల్లకు
ఎంత కష్టం? ఎంత కష్టం???

16 February 2015

ఎంకిపాట

కలలోన నా యెంకి, కవ్వించి సంపింది...
కళ్ళ కలువలు తెరసి, కలలు వొలికించింది!
ఒళ్లిరిచి నవ్వుతూ వగలు కురిపించింది...
సిగలోని పూలన్ని సిగ్గొలక బోసాయి... 
మల్లెపూదండేమొ మత్తిచ్చి గిల్లింది...
ఎంకి అందపు గంధమెద మొత్త మొలికెరా...
ఎక్కడుందో పేనమేడుందొ మనసూ...
ఎంత హాయిగ వుందొ ఎద గంతు లేస్తేను...
ఎంత హాయిగ వుందొ ఎద గంతు లేస్తేను!
గంతులేస్తా మనసు గతి జారి పడ్డాది...
తెలివి కమ్మెర వొచ్చి తెల్లారి పోయింది...
కళ్లిప్పి చూసాను కల కరిగి పోయింది...
కల కరిగిపోయింది, కత మారిపోయింది...
కల కరిగిపోయింది, కత మారిపోయింది...!

06 February 2015

గెలుపు,ఓటమూల ప్రాయణం ...

అందరికీ దండలో పూలే కావాలి.
అవే ఊడిపోతే, దారాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు!
గెలుపు గుంపుని తీసుకొస్తే,
ఓటమి ఒంటరితనాన్ని తీసుకొస్తుంది! 
గుంపే నిజం అని గెలుపులో మురిసిపోతాం,
మనమే నిజం అని ఓటమిలో తెలుసుకుంటాం!
పూలు వాడిపోవచ్చు, ఊడిపోవచ్చు...
దారం మాత్రం అంత త్వరగా తెగిపోకూడదు!
ముసిరే ఈగలని చూసి పొంగిపోకు,
మిగిలే ఎముకలని చూసి క్రుంగిపోకు...
నీకు నువ్వే... అనుకొని ప్రయాణం సాగిస్తూ ఉండు!