07 April 2015

ఈ జన్మకే....

ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...
ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...
ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన స్నెహితులు, సన్నిహితులు... 
ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!
మహా అయితే ఇంకో పదీ.. ఇరవై సంవత్సరాలు!
తప్పు చేసినా అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!
పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,
ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న!

20 March 2015

తెలుగెక్కడుందిరా తెలుగోడా !!!

తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారే తెలుగోడా...!
అమ్మనే ఈజిప్టు మమ్మీని చేసావు,
నాన్ననే డాడీకి డమ్మీని చేసావు...
నీ బిడ్డ అఆలు దిద్దనే లేదు,
తన భాష చదవడం రాయడం రాదు...
తెలుగునే వెలి వేసె మన బడులు కూడ,
తెలుగు మాట్లాడితే పగులుద్ది దౌడ!
తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారే తెలుగోడా...!
లేత మనసుల్లోన నీతులే ముద్రించు,
శతకాలు అటకెక్కి చెద పట్టినాయి!
బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమొనరించు,
మన తెలుగు సామెతలు మంట గలిసాయి!
రామాయణం లేదు, భారతం లేదు,
భాగవత పద్యాల్లొ ఒకటైన రాదు!
కథలు చెప్పే బామ్మ అమ్మమ్మ లేరి,
కదలరే టీవీల చుట్టూత చేరి!
మమ్మీకి ఎల్ కే జి ర్యాంకులే ముఖ్యం,
డాడీకి లైఫులో విజయమే లక్ష్యం!
తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారే తెలుగోడా...!
మువ్వన్నె జెండాను తెగ ఊపుతున్నావు,
దాన్ని చేసిన తెలుగువాడెవడొ తెలుసా?
వెండి తెర హీరోలు వీరులంటున్నావు,
నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా?
గుడి గుడీ గుంచాలు... కోతి కొమ్మచ్చి...
ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి!
పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి
పెంచావు వీడియో గేమ్సుపై పిచ్చి!
పోటీకి సయ్యంది నీ తెలుగు మేధ,
ఉనికినే మరచింది... అదీ అసలు బాధ!
తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారే తెలుగోడా...!
కూడు పెట్టని భాష 'భాష' కాదన్నావు,
డాలర్లు తెచ్చేదె అసలు చదువన్నావు!
తెలుగు పండగలన్ని మొక్కుబడి చేసావు,
కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు!
గ్లోబునే గెలిచాము చూడమన్నావు,
తల్లి వేరును మటుకు తెగ నరికినావు!
తెలుగు మొనగాణ్ణి అని తొడ చరిచినావు,
తల్లి పేరడిగితే తెల్లబోయావు!
నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా?
సెంటిమెంటల్ స్టంటు చాలు నీ బొందా!
తెలుగెక్కడుందిరా తెలుగోడా,
నీ తెలుగు తెల్లారే తెలుగోడా...!

28 February 2015

ఎంత కష్టం

దారి దాపున చెత్తకుప్పల చిత్తు చిరుగుల నేరుకుంటూ
చిట్టికొడుకును చంక మోసి అలిసిపోయే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
చిరిగిపోయి మాసిపోయిన చీరకొంగును బొడ్డు దోపి 
పాలుగారే చిట్టి బిడ్డను బొంత మీద పండబెట్టి
మట్టిరాళ్ళను మోసుకెళ్ళే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
నెత్తి మీదన మోపు బెట్టి కాలినడకన ఊర్లు తిరిగి,
చంక జొలెన బిడ్డ నొదలక
కడుపు కూటికి చీపుర్లనమ్మే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
పందులున్నా కుక్కలున్నా దోమలున్నా ఈగలున్నా
పలుగు పరకతో రొచ్చు తీసి,
పాయి ఖానాలను శుభ్రం చేసే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
మంచుకురుసినా మండుటెండలయినా,
అర్థరాత్రయినా అపరాహ్ణమయినా పిల్లపాపలను పెనిమిటిని వదలి
చీపురెట్టి నగరరోడ్లను శుభ్రం చేసే మాతృమూర్తికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
భూమి తల్లిని నమ్ముకోని ఎండ గాని వాన గానీ
దుక్కి దున్ని నాట్లు వేసి కలుపు తీసి
కండె జూసి పంట కోసి ఎండబెట్టి ఎండిబొయ్యే రైతుతల్లికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
పచ్చ రవిక తొడిగి తెల్ల చీర కట్టి,
మల్లెపూలు ముడిచి ముస్తాబుగ అలంకరించి
పస వాడని పసిడితల్లిని మాతమ్మను చేసి,
ఆచారం పేరిట మాతమ్మయిన ఆ చిన్నతల్లికి
ఎంత కష్టం? ఎంత కష్టం???
ఆడపిల్ల కెవ్వుమంటే వడ్ల గింజను నోటదోసి
పురిటి పసికందు ప్రాణాలు తీసే తల్లితండ్రుల దాష్టికానికి
బలి అయిన అన్నెం పున్నెం ఎరుగని ఆడపిల్లకు
ఎంత కష్టం? ఎంత కష్టం???

16 February 2015

ఎంకిపాట

కలలోన నా యెంకి, కవ్వించి సంపింది...
కళ్ళ కలువలు తెరసి, కలలు వొలికించింది!
ఒళ్లిరిచి నవ్వుతూ వగలు కురిపించింది...
సిగలోని పూలన్ని సిగ్గొలక బోసాయి... 
మల్లెపూదండేమొ మత్తిచ్చి గిల్లింది...
ఎంకి అందపు గంధమెద మొత్త మొలికెరా...
ఎక్కడుందో పేనమేడుందొ మనసూ...
ఎంత హాయిగ వుందొ ఎద గంతు లేస్తేను...
ఎంత హాయిగ వుందొ ఎద గంతు లేస్తేను!
గంతులేస్తా మనసు గతి జారి పడ్డాది...
తెలివి కమ్మెర వొచ్చి తెల్లారి పోయింది...
కళ్లిప్పి చూసాను కల కరిగి పోయింది...
కల కరిగిపోయింది, కత మారిపోయింది...
కల కరిగిపోయింది, కత మారిపోయింది...!

06 February 2015

గెలుపు,ఓటమూల ప్రాయణం ...

అందరికీ దండలో పూలే కావాలి.
అవే ఊడిపోతే, దారాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు!
గెలుపు గుంపుని తీసుకొస్తే,
ఓటమి ఒంటరితనాన్ని తీసుకొస్తుంది! 
గుంపే నిజం అని గెలుపులో మురిసిపోతాం,
మనమే నిజం అని ఓటమిలో తెలుసుకుంటాం!
పూలు వాడిపోవచ్చు, ఊడిపోవచ్చు...
దారం మాత్రం అంత త్వరగా తెగిపోకూడదు!
ముసిరే ఈగలని చూసి పొంగిపోకు,
మిగిలే ఎముకలని చూసి క్రుంగిపోకు...
నీకు నువ్వే... అనుకొని ప్రయాణం సాగిస్తూ ఉండు!


21 January 2015

Change ...

గతంలో మనందరం చెడ్డోళ్ళమే,
భవిష్యత్తులో మనందరం మంచోళ్ళమే!
కానీ ఇప్పుడు, ఈ క్షణం,
మనం ఎవరన్నదే నిజం!
మారాలి అనుకుంటే రేపు అని, ఈ శనివారం అని,
వచ్చే సంవత్సరమని అవసరంలేదు.
ఈ క్షణం చాలు!

15 January 2015

జీవిత౦ అనగా ??

అనుభవాల మ౦త్రులకు
గాయాలే - రాజులు 
నమ్మక౦ - సేనాధిపతి 
బ౦ధువులు - భటులు 
స్నేహితులు - ఆ౦తర౦గికులు 
తల్లులు - దాసీలు
భోగాలు - రాణులు
హృదయమే - స౦పద‌
స్వప్రయోజనాలే - శత్రువులు
పిల్లలు - ప్రజలు
పదవి - శరీర౦
ప్రవర్తన - ఆత్మ‌
జీవితమే - రాజ్య౦