23 May 2014

స్వాతంత్ర్యం – శ్రీశ్రీ

నా స్కూలు కాపీబుక్కు మీద, బల్ల మీద,
చెట్లు మీద, ఇసుక మీద, మంచు మీద,
నీ పేరే రాస్తాను!
చదివిన ప్రతి పేజీ మీద, తెల్లని ప్రతి కాగితం మీద,
రాయి రక్తం అట్ట మీద, బుగ్గి మీద,
నీ పేరే రాస్తాను!
తళుకు బెళుకు భ్రమల మీద, సిపాయిల తుపాకుల మీద,
మహారాజుల కిరీటాల మీద,
నీ పేరే రాస్తాను!
అడవి మీద, ఎడారి మీద, పిట్టగూళ్ళ మీద,
చీపురుకట్టల మీద, శిశుత్వపు ప్రతిధ్వనుల మీద,
నీ పేరే రాస్తాను!
చిత్రమైన రాత్రుల మీద, పగళ్ళ తెల్లని వేడి అన్నం మీద,
పెళ్లి మాటలాడుతున్న ఋతువుల మీద,
నీ పేరే రాస్తాను!
నా వినీలాకాశపు చింకిపాతల మీద,
చెరువులోని సూర్యుని మీద, చంద్రుని సజీవ సరోవరం మీద,
నీ పేరే రాస్తాను!
ప్రపంచపుటంచున పంటపొలాల మీద,
పక్షుల రెక్కల మీద, నీడల గాలితిరుగుడు మరల మీద,
నీ పేరే రాస్తాను!
ఉదయిస్తున్న ప్రతి పవనాంకురం మీద, నా కలం మీద,
సముద్రం మీద, వెర్రెత్తిన పర్వతం మీద,
నీ పేరే రాస్తాను!
మబ్బుగుంపుల నాచు మీద, తుఫానుల చెమట మీద,
రుచిలేని చిక్కటి వాన మీద,
నీ పేరే రాస్తాను!
రంగు రంగుల రూపాల మీద, ఇంద్రధనుస్సు గంటల మీద,
స్పర్శించదగిన సత్యం మీద,
నీ పేరే రాస్తాను!
మేలుకొంటున్న సందుల మీద, విస్తరిల్లుతున్న వీధుల మీద,
శ్రుంగాటకాల వరదల మీద,
నీ పేరే రాస్తాను!
వెలిగించిన దీపం మీద, మరణించే దీపం మీద,
మళ్ళీ కలుసుకున్న మా ఇళ్ళ మీద,
నీ పేరే రాస్తాను!
రెండుగా తరగిన పండు మీద, గదిలో ఉన్న నా అద్దం మీద,
శూన్యమైన నా శయ్యాశంఖం మీద,
నీ పేరే రాస్తాను!
నా కుక్కపిల్ల గూటి మీద, రిక్కించిన దాని చెవుల మీద,
దాని అడ్డదిడ్దపు పాడమ మీద,
నీ పేరే రాస్తాను!
కిర్రుమనే తలుపు మీద, పవిత్రాగ్నుల కెరటం మీద,
నాకు తెలిసిన, నేను ప్రేమించిన వస్తువు మీద,
నీ పేరే రాస్తాను!
శ్రావ్యమైన శరీరం మీద, స్నేహితుల ముఖాల మీద,
చాచిన ప్రతి హస్తం మీద, నీ పేరే రాస్తాను!
వింతైన కిటికీ అద్దం మీద,
నిశ్సబ్దానికి చాలా అవతల పెదవులపై నిలిచే ఏకాగ్రత మీద,
నీ పేరే రాస్తాను!
నా కూలిపోయిన గుడిసె మీద, పడిపోయిన దీపగృహల మీద,
నా విసుగుదల గోడల మీద,
నీ పేరే రాస్తాను!
కోరికలేని అదృశ్యత మీద, నగ్నమైన ఒంటరితనం మీద,
మరణపు సరిహద్దుల మీద,
నీ పేరే రాస్తాను!
ఇప్పుడే కోలుకుంటున్న ఆరోగ్యం మీద,
నిష్క్రమించిన ప్రమాదం మీద, జ్ఞాపకం లేని ఆశ మీద,
నీ పేరే రాస్తాను!
ఒక్క శబ్దం శక్తి వల్ల నా బ్రతుక్కి పునర్జన్మ!
నేనెందుకు జన్మించానా?
నిన్ను తెలుసుకోవాలని!
నీ మననం, నా జననం – స్వాతంత్ర్యం!

No comments:

Post a Comment